పేదల భూములు పేదలకే…!

👉 అక్రమ భూములు స్వాధీనం చేసుకుంటాం !

👉 ధర్మారం ప్రభుత్వ భూములను సర్వే చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తాం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

మండలంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను సమగ్రంగా సర్వే చేసి, అక్రమంగా ఇతరుల ఆధీనంలో ఉన్న భూములను చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

👉 ధర్మారం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…..

పేదలకు గతంలో పంపిణీ చేసిన భూములను కొందరు అక్రమంగా కొనుగోలు చేసి, రికార్డులను తారుమారు చేసి అనుభవిస్తున్నారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని తెలిపారు. ఆర్థికంగా బలమైన వ్యక్తుల ఆధీనంలో ప్రభుత్వ భూములు ఉన్నట్లు తేలితే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు అందిస్తామని స్పష్టం చేశారు.

👉 సర్వే నంబర్ 676పై సమగ్ర విచారణ..!

ధర్మారం మండలంలోని సర్వే నంబర్ 676కు సంబంధించి ఓఆర్‌సీ ఎప్పుడు ఇచ్చారు, ఇనాం హక్కుదారులు ఎంతమంది ఉన్నారు, నిషేధిత భూమిని పట్టా భూమిగా ఎలా మార్చారనే అంశాలపై విచారణ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. పేదల భూములు వారికి దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

👉 పేదలకు ఇళ్ల స్థలాలు..!

ధర్మారం మండల కేంద్రంలోని జక్కన్నపల్లి, తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూములను లేఅవుట్ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. పార్టీలు, కులాలకు అతీతంగా నిజమైన అర్హులను గుర్తించి డ్రా పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు.

👉 ఫామ్‌హౌస్‌లపై సవాల్…!

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితర బీఆర్‌ఎస్‌ నాయకుల ఆధీనంలోని ఫామ్‌హౌస్‌లలో ప్రభుత్వ భూములు ఉన్నట్లు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని మంత్రి అన్నారు. ప్రభుత్వ భూములు ఉన్నట్లు నిరూపిస్తే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా ? అని సవాల్ చేశారు.

దళితులు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద ధర్నా చేసిన సందర్భంలో పసుపు నీళ్లతో ప్రదేశాన్ని శుద్ధి చేశారనే అంశంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు.

👉 ధర్మారం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి…..!

ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో ఏటీసీ (ఐటీఐ) నిర్మాణానికి త్వరలో మంత్రి డాక్టర్ వివేక్ చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మండల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. మంత్రి వెంట ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్ల నాయక్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంజిత్‌తో పాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.