సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేపడుతూ.!

👉 విధ్వంసమైన తెలంగాణ వికాసం వైపు …!

👉 సిరిసిల్ల  బహిరంగ సభలో  సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,

ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి  సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

👉 సిరిసిల్ల నేతన్నల ప్రాశస్త్యాన్ని ఈ సందర్భంగా వివరించారు. “మనిషి నాగరికత వస్త్రంతో ప్రారంభమైంది. అలాంటి వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల అడ్డా. చేనేత కార్మికులకు, చేతివృత్తులకు ఇది ప్రధాన కేంద్రం.

👉 అగ్గిపెట్టెలో చీరను మడతపెట్టే నైపుణ్యం ఇక్కడి నేత కార్మికుల ప్రత్యేకత. ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు తెచ్చిన నైపుణ్యం కలిగిన చేనేత సోదరులు ఈ ప్రాంతంలో ఉన్నారు. చేనేత మగ్గాల నుండి సాంచాల వరకు వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు” అని చెప్పారు.

👉 ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారని గుర్తుచేస్తూ, గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు కార్మికులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడానికి ₹ 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రత్యేక విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.

👉 అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే సంక్షేమం కోసం రేషన్ కార్డు జారీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ₹ 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి కొనసాగిస్తున్న పథకాలను ముఖ్యమంత్రి  వివరించారు.

👉 చేనేత రంగానికి గత పదేళ్లలో ₹ 2,234 కోట్లు ఖర్చు చేస్తే, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన రెండున్నరేళ్లలో ₹1,751 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఈ సందర్భంగా నేరెళ్ల బాధితులకు ముఖ్యమంత్రి  ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

👉 ఈ బహిరంగ సభలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు , పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మహమ్మద్ అజారుద్దీన్, విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.