👉 శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు శృంగేరి పీఠాధిపతి అనుమతి !
👉 పుష్కరాల అనంతరం యోగ నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణకు నిర్ణయం !
👉 ఆలయ ప్రారంభోత్సవానికి జగద్గురువులను ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గోదావరి తీరాన వెలసిన ప్రాచీన పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు ఆగమ శాస్త్రాలు, సనాతన సంప్రదాయాలు, పురాతన ఆచార వ్యవహారాలకు అనుగుణంగా కొనసాగనున్నాయి. ఆలయ జీర్ణోద్ధరణకు సంబంధించి శృంగేరి పీఠాధిపతి జగద్గురులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామివారి అనుమతి, ఆశీస్సులు లభించడంతో పునరుద్ధరణ పనులకు మార్గం సుగమమైంది.
ఆలయ పునరుద్ధరణ పనుల ప్రణాళిక, నిర్మాణ విధానం తదితర అంశాలను వివరించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, స్తపతి ప్రసాద్, ఆలయ ఈవో శ్రీనివాస్, పురాణ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ అలువాల శ్రీనివాస్, ధర్మపురి అగ్రహారం పెద్దలు సోమవారం శృంగేరి పీఠాధిపతులను దర్శించుకున్నారు.
👉 ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా…!

ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ, జీర్ణోద్ధరణకు సంబంధించిన పత్రాలను జగద్గురువులకు సమర్పించి, చేపట్టనున్న నిర్మాణ పనుల వివరాలను ఆధ్వర్యంలోని బృందం జగద్గురువులకు వివరించింది. ఆలయ పునరుద్ధరణలో శాస్త్ర, ఆగమ, సనాతన సంప్రదాయాలను అనుసరించేలా మార్పులు ఉన్నాయని జగద్గురులు పేర్కొన్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
పునరుద్ధరణ పనులు ప్రారంభించి వచ్చే గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేయాలని జగద్గురులు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ధర్మపురి క్షేత్ర ప్రాచీనతకు భంగం కలగకుండా, సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
👉పుష్కరాల అనంతరం యోగ నరసింహుడి ఆలయానికి పునరుజ్జీవం !

ధర్మపురిలోని మరో ప్రాచీన ఆలయమైన శ్రీ యోగ నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణను కూడా చేపట్టాలని జగద్గురులు సూచించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల అనంతరం యోగ నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను చేపడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.
👉 ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం !
ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పూర్తయిన అనంతరం నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ జగద్గురువులను ఆహ్వానించారు. మంత్రి ఆహ్వానాన్ని స్వీకరించిన జగద్గురులు ప్రారంభోత్సవానికి హాజరవుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం ఇప్పటికే ₹10 కోట్లు కేటాయించగా, ఇటీవల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులు, అనుమతి లభించడంతో ఇక ఆలయ పునరుద్ధరణ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ సందర్భంగా జగద్గురులు మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాలను అందించి ఆశీర్వదించారు.
