👉 సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో…!
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు విధించడం, వసూలు చేయడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, అత్యవసర వైద్య సాయం అందించడమే లక్ష్యంగా ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ (TG-TMARS)ను ఏర్పాటు చేశారు.
👉 ‘రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి’ పరిధిలో ఈ కొత్త వ్యవస్థ ముఖ్యమంత్రి పరిధిలో పనిచేస్తుంది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 135) జారీచేసింది. ఈ ప్రత్యేక విభాగం అదనపు డీజీపీ (ADGP) లేదా ఐజీపీ (IGP) స్థాయి అధికారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది.
👉 రాష్ట్రంలోని 32 వేల కిలోమీటర్లకు పైగా ఉన్న రహదారులు, 1.8 కోట్లకు పైగా ఉన్న వాహనాల రాకపోకలను ఈ బ్యూరో పర్యవేక్షిస్తుంది. రోడ్డు రవాణాతో పాటు మెట్రో, రైల్వే భద్రతను కూడా ఈ విభాగానికే అప్పగించారు.
👉 బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతీ పోలీస్ స్టేషన్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఒక ‘రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్’ను నియమిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి తరలించడం వీరి బాధ్యత.
👉 అలాగే ఔటర్ రింగ్ రోడ్డు (ORR), 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్న హైవేలపై స్పీడ్ డిటెక్టర్లు, అత్యాధునిక కెమెరాలతో కూడిన ‘హైవే పెట్రోలింగ్ యూనిట్లు’ ఏర్పాటు చేసి నిరంతరం పహారా ఇస్తారు. ఈ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్’ను ఏర్పాటు చేశారు.
👉 పోలీసులకు వచ్చే ట్రాఫిక్ జరిమానాల్లో 40% మొత్తాన్ని నేరుగా ఈ నిధికే మళ్లిస్తారు. ఈ నిధులను సిబ్బంది శిక్షణ, అధునాతన సాంకేతికత, పెట్రోలింగ్ వాహనాలు మరియు రహదారుల అత్యవసర మరమ్మతుల కోసం ఉపయోగిస్తారు.
